Thomas Alva Edison Success Story in Telugu
Success Stories,  Uncategorized

Thomas Alva Edison Success Story in Telugu

(Thomas Alva Edison)థామస్ అల్వా ఎడిసెన్.. ఈ పేరు తెలియనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. అంధకారంలో ఉన్న ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు ఆయన. సూర్య భగవానుడు ఈ ప్రపంచానికి 12 గంటలే వెలుగును ఇస్తే.. ఎడిసన్ విద్యుత్ బల్బ్ ని కనుగొని 24 గంటలూ వెలుగుని ఇచ్చాడు..

ఈరోజు ప్రపంచమంతా వెలుగులో ఉంది అంటే అది ఆ మహావ్యక్తి యొక్క వైఫల్యాల ఫలితమే. సుమారుగా 1000 సార్లు ఫెయిల్ అయిన ఎడిసన్.. బల్బ్ ని ఎలా కనుగొన్నాడు? ఆయన జీవిత ప్రయాణం ఏమిటి? (Thomas Alva Edison Success Story in Telugu)

ఎడిసన్ గురించిన ఆసక్తికరమయిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 లో అమెరికాలో గల మిలాన్ అనే నగరంలో జన్మించారు. ఆయనకు 7 సంవత్సరాల వయసు ఉండగా అయన యొక్క కుటుంబం మిచిగాన్ కు మకాం మార్చింది. అక్కడ ఒక చిన్న పాఠశాలలో ఎడిసన్ ను చేర్పించారు.

Thomas Biography in Telugu
Thomas Biography in Telugu

అక్కడ ఉపాధ్యాయుడు పరమ చాదస్తుడు. విద్యార్థులు ప్రశ్నలు వేస్తే అస్సలు సహించేవాడు కాదు. పిల్లలతో పాఠాలు బట్టీ పట్టించేవాడు. ఒకరోజు ‘న్యూటన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు’ అని పిల్లలతో అదేపనిగా చెప్పించసాగాడు. ఈలోగా ఎడిసన్(Edison) పైకి లేచి ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం’ అంటే ఏమిటి మాస్టారూ అని అడిగాడు. దానికి ఆ ఉపాధ్యాయుడు ఎదురుప్రశ్నలు వేయడం మానేసి కూర్చో అని ఎడిసన్ ని కుర్చేపెట్టేసాడు.

ఎడిసన్ కు అది ఏ మాత్రమూ నచ్చలేదు. మిగతా పిల్లలు అంతా పాఠం చెబుతూ ఉంటే.. ఎడిసన్(Edison) మాత్రం పరధ్యానంలో దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అది గమనించిన టీచర్ అతడిని పిలిచి కోపంతో.. బెత్తంతో నాలుగు దెబ్బలు వేసి ఆయన తల్లిని పిలిపించి నీ కొడుక్కి మతి భ్రమించింది, చదువుకి పనికిరాడు ఇంటికి తీసుకుపొమ్మని ఇంటికి పంపేశాడు.

బాల్యంలో ఎడిసన్ జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. ఎడిసన్(Edison) కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. తన కుంటుబానికి ఆర్ధిక సహాయం అందించడం కోసం ఎడిసన్ డెట్రాయిట్ – మిచిగాన్ మధ్య తిరిగే రైలులో న్యూస్ పేపర్లు అమ్మేవాడు. ఆ విధంగా పోగుచేసిన కొంత డబ్బుతో కొంత కాలం తరువాత సొంతంగా ‘గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్’ అనే ఒక వార పత్రికను ప్రారంభించాడు. ఒక పాత ప్రింటింగ్ ప్రెస్ లో దానిని ముద్రించేవాడు.

Thomas Alva Edison
Thomas Alva Edison

డెట్రాయిట్ రైలులో ఇంజన్ కు ఆనుకుని ఉన్న బోగీకి ఎప్పుడూ పొగలు కమ్ముకుని ఉండేవి. అందువల్ల అందులో ప్రయాణికులు ఎవరూ కూర్చునేవారు కాదు. వార పత్రికతో వచ్చిన డబ్బుతో ఎడిసన్ ఆ బోగీలో ఒక టేబుల్ మీద చిన్నపాటి లేబరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు.

పేపర్లు అమ్మడం అయిపోయిన తరువాత ఎడిసన్ ల్యాబ్ లో ప్రయోగాలలో నిమగ్నమయ్యేవాడు. ఈ ప్రయోగాలలో భాగంగా ఒకరోజు పాస్పరస్ పుల్లకు నిప్పు అంటుకుంది. వెంటనే ఆ బోగీలో మంటలు చెలరేగాయి. అప్పటికి రైలు ఒక స్టేషన్ లో ఆగి ఉండటంతో వెంటనే అక్కడ రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేశారు. ‘మరోసారి రైలు ఎక్కితే కాళ్ళు విరగ్గొడతామని’ బలవంతంగా ఎడిసన్ ను రైలు నుంచి కిందకి నెట్టేశారు. ప్లేట్ ఫామ్ మీద పడ్డ ఎడిసన్ చెవికి పెద్ద దెబ్బ తగలడంతో అప్పటి నుంచి అతనికి వినికిడిలో లోపం మొదలయ్యింది.

ఎడిసన్ తన 16వ ఏట టెలీ గ్రాఫిస్ట్ గా మొదటి ఉద్యోగంలో చేరాడు. రైల్వే క్వార్టర్ లో రాత్రివేళ పని చేసే సిబ్బందికి గంటకొకసారి టెలీగ్రాఫ్ సంకేతం ద్వారా అప్రమత్తం చేయడం ఎడిసన్ డ్యూటీ. టెలిగ్రాఫ్ అంటే మాటలు లేకుండా దీపం వెలుగు, జెండాల వంటి సంకేతాలతో ప్రజలను అప్రమత్తపరచడం అన్నమాట.

ఈ పనిని మరింత సులువుగా చేసే మార్గం ఆలోచించాలి అనుకున్న ఎడిసన్ గడియారానికి టెలిగ్రాఫ్ మిషన్ ను అనుసంధానించి గంటకోసారి గడియారం మోగేలా చేసాడు. ఇది ఎడిసన్ యొక్క తొలి ఇన్వెన్షన్.

Thomas Edison with Phonograph
Thomas Edison with Phonograph

ఆ తరువాత 1877 లో ఎడిసన్ తనకు అత్యంత ఇష్టమయిన ఫోనోగ్రాఫ్ ని కనుగొన్నాడు. రికార్డు ప్లేయర్ కి ఇది తొలిరూపం. లోహపు సిలిండర్ పై గుండ్రటి గీతలు గీసి దాని మీద సూదిని ఉంచి గుండ్రంగా తిప్పితే రికార్డు చేసిన పాటలు, మాటలు వినపడతాయి. ఈ తరహా రికార్డ్ ప్లేయర్ లను మీరు పాత సినిమాలలో చూసే ఉంటారు. వినికిడి శక్తి తక్కువగా ఉన్న ఎడిసన్ ప్రపంచానికి పాటలు వినడానికి గ్రామ్ ఫోన్ రికార్డర్ ను కనుగొనడం విశేషం కదా..

ఆ తరువాతి సంవత్సరం ఎడిసన్ జీవితంలో మరుపురానిది. విద్యుత్ శక్తిని కాంతిగా మార్చాలన్నదే ధ్యేయంగా ఎడిసన్ పని చేస్తున్న రోజులు అవి..

బల్బ్ వెలగడానికి ఫిలమెంట్ నే కారణం అని తెలుసుకున్న ఎడిసన్ తన ల్యాబ్ లో పగలు, రాత్రి అని లెక్క చేయకుండా ఫిలమెంట్ తయారీ కోసం సరైన పదార్ధాన్ని కనుగొన్నాడు. కొబ్బరిపీచు, వెంట్రుకలు, వెదురు ముక్కలు ఇలా ఆయన ఫిలమెంట్ కోసం అన్వేషించని పదార్ధం లేదు.

Thomas Edison Bulb Invention
Thomas Edison Bulb Invention

ఒకరోజు ఆయన కూర్చుని ఆలోచిస్తూ ఉండగా కోటు గుండీకి ఉన్న నైలాన్ దారాన్ని ఫిలమెంట్ లో వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అంతే.. నైలాన్ దారానికి కర్బనం రాసి దానిని నికెల్ లో ఉంచాడు. దానిని ఐదు గంటల సేపు ఫర్నేస్ లో వేడిచేసాడు. ఆ తరువాత దానిని చల్లబరిచి ఒక సుతిమెత్తని లోహపు తీగను బయటకి తీసాడు. దానిని ఒక గ్లాస్ బల్బ్ లో అమర్చాడు. బల్బ్ నుంచి గాలిని తీసివేసి శున్యాన్ని సృష్టించాడు. అప్పుడు ఆ తీగలోకి కరెంట్ ను పంపాడు. ఫలితంగా బల్బ్ వెలిగింది.

అప్పటివరకు కొవ్వొత్తులు, చమురు దీపాలతో సర్దుకుపోయిన జనజీవనంలో అద్భుత వెలుగులు వెలిగాయి.

మనకి తెలిసినంత మట్టుకు ఎడిసన్ బల్బ్ ఒక్కటే కనిపెట్టాడు అనుకుంటూ ఉంటాం.. కానీ ఎడిసన్ దాదాపు 1300 లకు పైగా పరికరాలను కనిపెట్టాడు.

ఎడిసన్ బల్బ్ ని కనిపెట్టడంలో సుమారుగా 1000 సార్లు విఫలమయ్యాడు. అయినప్పటికీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా తన లక్ష్యం వైపే ద్రుష్టి పెట్టి ప్రయత్నాలని చేస్తూ ప్రపంచాన్ని వెలుగులోనికి తెచ్చాడు.

ఫ్రెండ్స్ మనలో ఎంత మంది ఒకటి, రెండు ఫెయిల్యూర్స్ తరువాత కూడా పట్టు విడవకుండా ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు? మీ లక్ష్యం ఏదైనప్పటికీ కూడా రాత్రికి రాత్రే లేదా కొన్ని వారాలలో లేదా కొన్ని నెలలో విజయం మీకు వరించేయదు. చివరివరకు ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళ చెంతకే విజయం చేరుతుంది.

ఈరోజున ఎడిసన్ భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ సాయంత్రం 6 గంటల తరువాత ప్రపంచంలోని లైట్ లు వెలిగే ప్రతీ ఇంటిలోనూ ఆయన బ్రతికి ఉన్నట్టే..

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చితే LIKE చేయండి, మీ స్నేహితులు అందరితో SHARE చేసుకోండి. మీ అభిప్రాయాన్ని COMMENT చేయడం మాత్రం మరచిపోకండి.

You may also Like: Alexander Graham Bell Success Story in Telugu

THANK YOU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *