అలెగ్జాండర్ గ్రాహంబెల్(Alexander Graham Bell) దూరంగా ఉన్నవారితో మాట్లాడటం కోసం కనిపెట్టిన ఫోన్ ఈరోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాల్సిన కచ్చితమైన వస్తువుల్లో ఒకటిగా చేరిపోయింది. పేస్ బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్ ల వంటివి మనకి వినోదాన్ని పంచేవాటిగా మరియు మనల్ని ఫోన్ కు మరింత అతుక్కుపోయేలా చేస్తున్నాయి. మనకి ఇంతలా చేరువైన ఫోన్ ని గ్రాహంబెల్(Alexander Graham Bell) ఎలా కనిపెట్టాడు? ఫోన్ యొక్క చరిత్ర ఏమిటి? ఫోన్ తో అలెగ్జాండర్ గ్రాహంబెల్(Alexander Graham Bell) ప్రయాణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

“మిస్టర్ వాట్సన్, కమ్ హియర్ ప్లీజ్! ఐవాంట్ యూ” అని మొట్టమొదటగా టెలిఫోన్ పలికింది. అది విని, తన చెవులను తాను నమ్మలేకపోయాడు వాట్సన్. ఫోన్ అక్కడ పడేసి, రెండేసి మెట్లు చొప్పున అంగలు వేసుకుంటూ, చిటికెలో మేడమీదికి పరిగెత్తాడు. “వినిపించాయి, నీ మాటలు-నువ్వు చెప్పినదంతా వినిపించేసింది… స్పష్టంగా!” అని అరుస్తూ, వగరుస్తూ బెల్ గదిలోకి ప్రవేశించాడతను. బెల్ సంతోషానికి అంతులేదు. వాట్సన్ సహాయంతో బెల్ చేస్తున్న ప్రయోగాలు అప్పటికి సఫలమయ్యాయి.
తొలిసారిగా అలెగ్జాండర్ గ్రాహంబెల్ (Alexander Graham Bell) తయారుచేసిన టెలిఫోన్ పనిచేయడం మొదలు పెట్టింది. అది 1876 మార్చి పదో తారీఖు. స్వదేశంలో అయినా, ఖండాంతరంలో అయినా, ఎంతదూరంలో ఉన్న వారితో అయినా సూటిగా మాట్లాడ్డానికి ఒక సాధనాన్ని ప్రసాదించిన చరిత్రాత్మకమైన రోజు అది. ఆ సాధనాన్ని నిర్మించిన అలెగ్జాండర్ గ్రాహంబెల్(Alexander Graham Bell) 1847లో మార్చి 3వ తారీఖున స్కాట్లాండ్ లోని ఎడిన్ బెర్గ్ అనే ప్రాంతంలో లో జన్మించారు.

కేబుల్ వైర్ ద్వారా అవతలి వారికి మాటలు చేరవేయడం గురించి గ్రాహంబెల్ పరిశోధనలు చేస్తున్న రోజులవి. విద్యుత్తు తీగల సహాయంతో మాటలు ప్రసారం చేయడం సాధ్యమా అనే ప్రశ్న అతనికి స్ఫురించింది. అందుకోసం ముందుగా మనిషి చెవి ఎలా పని చేస్తోంది, శబ్దాలకి చెవిలో ఏమేమి ఎలా స్పందిస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలించాడు.
తన పరిశోధనలో భాగంగా “మాట్లాడినప్పుడు ఆయా శబ్దాలకి తగ్గట్టుగా, గాలి అణువులలో కదలికలు ఎలా పుడతాయి, ఆ కదలికలకు అనుగుణంగా చెవి గూబ కంపిస్తుంది, గూబకు ఆనుకున్న ఎముకలు కదిలి తద్వారా మనకి మాట అనేది వినపడుతుంది” అని తెలుసుకున్నాడు.
చెవి నిర్మాణంలో గూబకి ఉండే ప్రాధాన్యతని గుర్తించిన బెల్ మాటల్ని బట్టి గాలిలో ఏర్పడే తరంగాలలాగే, తీగలో ప్రవహించే విద్యుత్ ప్రవాహంలో కూడా మార్పులు వస్తే ధ్వనిప్రసారం చేయవచ్చు అని అనుకున్నాడు. ఆ దృష్టితో బెల్ కొనసాగించిన కృషి ఫలితంగా ‘టెలిఫోన్’ తయారయింది.
మాటలు గ్రహించేందుకు మైక్రోఫోన్, వినిపించేందుకు రిసీవరు అనే రెండు భాగాలు ఒకే దానికి జత చేయబడి ఉంటాయి. ఈ రెండూ కలిసి టెలిఫోన్ అవుతుంది. అయితే మాటలకు తగ్గట్టు కంపించే పల్చని అల్యూమినియం రేకువంటి డయాఫ్రం మైక్రోఫోన్ లో ఉంటుంది.

బ్యాటరీ నుంచి విద్యుత్తు బయలుదేరి.. డయాఫ్రం చేసే ప్రకంపనాలకు విద్యుత్ ప్రవాహ మార్గంలో నిరోధం ఏర్పడుతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం మారుతుంది. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కి చేరుతుంది. ఆ విద్యుత్ ప్రవాహంలోని మార్పుల కనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్ ప్రవాహం మారుతూ ఉంటుంది. విద్యుత్ ప్రవాహం మార్పులకు తగినట్టు ఆ అయస్కాంత ధృవాల ఆకర్షణబలం మారుతూ, డయాఫ్రంను కంపింపజేస్తూ ఉంటుంది. దీని ద్వారా ధ్వని అనేది మనకి వినపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అలెగ్జాండర్ గ్రాహంబెల్ కనుగొన్న మొట్టమొదటి టెలిఫోన్ పనిచేసే విధానం ఇది.
ఇది ఇలా ఉండగా ఫోన్ కనుగొన్న తరువాత, ఫిలడల్ఫియాలో పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. తన టెలిఫోన్ తీసుకునివచ్చి, బెల్ అందులోకి ప్రవేశించాడు. తాను ఒకచోట దూరంగా నిలబడి, ఫోను ఒకచోట ఏర్పాటు చేశాడు. కాని మొదట్లో దానిమొహం ఎవరూ చూడలేదు. బ్రెజిల్ చక్రవర్తి అయిన డాన్ పెడ్రో అనే ఆయన ఎగ్జిబిషన్ చూడ్డానికివచ్చి, ఆ ఫోన్ తీసి చెవిదగ్గిర పెట్టుకున్నాడు. గ్రాహం బెల్ అటుపక్కనుంచి, “టుబి ఆర్ నాట్ టుబి” అనే హామ్లెట్ ప్రఖ్యాత వాక్యాలు చదివాడట. అది విని, “అరే, ఇది మాట్లాడుతోందే!” అని చక్రవర్తి ఫోన్ కేసి చూసి ఆశ్చర్యపడ్డాడట. అప్పటి నుంచి బెల్ టెలిఫోన్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
టెలిఫోన్ కు తానే నిర్మాత అయినా, బెల్, ఎప్పుడూ ఫోన్ వాడేవాడుకాదుట!
పేరు ప్రఖ్యాతులు పట్టించుకోకుండా 1922 వరకు జీవించిన నిరాడంబర జీవి గ్రాహం బెల్ యొక్క జీవితం మన అందరికీ స్ఫూర్తి దాయకం. ఆయన భౌతికంగా మన అందరికీ దూరమైనప్పటికీ ఫోన్ ఉన్న ప్రతీ ఇంట్లోనీ ఆయన జీవించే ఉన్నారు.
ఏది ఏమైనప్పటికీ మన అందరికీ పలు రకాలుగా సహాయపడుతున్న ఫోన్ ని కనుగొన్న గ్రాహంబెల్ కి ఎన్నిసార్లు THANKS చెప్పినా అది తక్కువే…
You May Also Like: APJ అబ్దుల్ కలాం సక్సెస్ స్టోరీ తెలుగులో..
OK ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్టయితే LIKE చేయండి, మీ స్నేహితులందరికీ SHARE చేసుకోండి.
One Comment
Pingback: